
చిరంజీవి 150వ సినిమా రిలీజ్ అవుతోందంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తానని చెపితే అందరూ ఆసక్తిగా వింటారు. కెసిఆర్ కి జగన్ షేక్-హ్యాండ్ ఇస్తే అందరూ ఆసక్తిగా చూస్తారు. అందుకు కారణం వారందరికీ ప్రజలలో ఎంతో కొంత ఆదరణ, పలుకుబడి ఉండటమే. హాస్యనటుడు ఆలీకి కూడా మంచి గుర్తింపే ఉన్నప్పటికీ, ఆయన నోటి దురుదతో హీరోయిన్ల గురించి వేదికల మీద ద్వందార్ధాలతో అసభ్యంగా మాట్లాడటంతో చాలా విమర్శలు మూటగట్టుకొన్న సంగతి తెలిసిందే. అయినా, తను కూడా చిరంజీవి, కెసిఆర్ రేంజి వ్యక్తినని అనుకొంటారొ ఏమో తెలియదు కానీ తన కోసం రాష్ట్ర ప్రజలు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారన్నట్లుగా త్వరలోనే రాజకీయలలోకి వచ్చేస్తున్నానంటూ మీడియాకి చెబుతుంటారు. గతంలో ఒకట్రెండు సార్లు అలాగే చెప్పారు కానీ ఇంతవరకు ధైర్యం చేయలేకపోయారు. మళ్ళీ ఇటీవలే, మరోసారి తన రాజకీయ ప్రవేశ ప్రకటన దానికి వేదిక, ముహూర్తం కూడా ప్రకటించారు.
2019 ఎన్నికలలో రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో తను ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తానని చెప్పారు. ఆయన వచ్చినా రాకపోయినా సంతోషించేవాళ్ళు బాధపడేవాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఇక్కడ గ్రహించవలసిన విషయమేంటంటే, పవన్ కళ్యాణ్ జనసేన గురించి కూడా ఆయన ప్రస్తావించడం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలకి ఒప్పుకొన్నారని అవి పూర్తవగానే రాజకీయాలలో వస్తారని, 2019 ఎన్నికలలో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని చెప్పారు.
ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పారు. పవన్ కి ఆలీ సన్నిహితంగా మెలుగుతుంటారు కనుక ఆలీ చెప్పిన ఈ మాటని నమ్మవచ్చు. కనుక రాజమండ్రిలో బహిరంగ సభలో రాజకీయ ప్రవేశం చేస్తానని ఆలీ చెప్పడం చూస్తుంటే, బహుశః అక్కడ జనసేన సభను నిర్వహిస్తే అప్పుడే అలీ ఆ పార్టీలో చేరబోయే అవకాశం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.
ఏమైనప్పటికీ, ఒకవేళ జనసేన పార్టీ 2019 ఎన్నికలలో పోటీచేస్తే అది ఏపి రాజకీయాలలో చాలా సంచలన విషయమే అవుతుంది. విశేషం ఏమిటంటే, అన్నయ్య చిరంజీవి రాజకీయాలలో తలబొప్పి కట్టి సినిమాలలోకి తిరిగి వస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలు విడిచిపెట్టి రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్నారు. ఒకవేళ 2019 ఎన్నికలలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తే, అప్పుడు రాజకీయాలలో ఆన్నయ్యలేని లోటుని తమ్ముడు తీరిస్తే, సినిమాలలో తమ్ముడు లేని లోటుని అన్నయ్య తీరుస్తుంటారు.