పవన్ కళ్యాణ్ తో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి భేటీ

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శనివారం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో ఆయన నివాసంలోనే భేటీ అయ్యారు. తన కుమారుడు నిఖిల్ గౌడని తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేయడానికి ముందు పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం కోసమే కలిసినట్లు కుమార స్వామి చెప్పారు. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానినని, ఆయనతో తమకి మంచి అనుబందం ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కర్ణాటకలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారని కుమార స్వామి చెప్పారు. 

తరువాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుమార స్వామితో తనకి 2008 నుంచి పరిచయం ఉందని, ఆయన కుటుంబ సభ్యులతో కూడా తనకి మంచి అనుబందం ఉందని అన్నారు. తమ మద్య ఎటువంటి రాజకీయ చర్చలు జరుగలేదని చెప్పారు. నిఖిల్ గౌడ సినీ ప్రవేశం గురించి మాత్రమే మాట్లాడుకొన్నామని చెప్పారు. 

సాధారణంగా పవన్ కళ్యాణ్ నిజాయితీగా మనసులో మాటే చెపుతుంటారు కనుక వారి సమావేశం కేవలం ‘జాగ్వార్’ సినిమా గురించే చర్చించి ఉండవచ్చు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ప్రత్యేక హోదా అంశంపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం కోరగా తరువాత చెపుతానని తప్పించుకొన్నారు. ప్రత్యేక హోదాకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఆయన చిన్న మాట మాట్లాడినా అది ఏపి రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తుంది కనుకనే దానిపై మాట్లాడలేదని భావించవచ్చు.