
రజనీకాంత్ నటించిన కబాలి సినిమా చాలా భారీ అంచనాలతో విడుదలైంది. ఊహించినట్లుగానే సినిమాకి బారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు ప్రధాన కారణం ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండున్నర వేల థియేటర్లలో విడుదల చేయడమే తప్ప సినిమాలో దమ్ము ఉండటం చేత మాత్రం కాదు. కనుక వారం పది రోజుల్లోనే సినిమా పని అయిపోయింది.
రోబో సినిమా తరువాత రజనీకాంత్ నటించిన దాదాపు అన్ని సినిమాలు ఇదే విధంగా బోర్లా పడుతుండటంతో ఆయన ప్రతిష్ట దెబ్బ తింటోంది. కబాలి ఫ్లాప్ తరువాత ఇక ఆయన సినీ పరిశ్రమ నుంచి రిటైర్ అయ్యే సమయం వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపించింది. ఆయనపై నమ్మకంతో సినిమాలు కొంటున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా నష్టపోతున్నారు. ఆ కారణంగా వారు ఆయన ఇంటి ముందు ధర్నాలు చేయడం, నష్ట పరిహారం కోసం కోర్టులలో కేసులు వేస్తుండటంతో ఆయన ప్రతిష్ట ఇంకా మసక బారిపోతోంది. కబాలి సినిమా విషయంలో కూడా మళ్ళీ ఇదే సమస్య పునరావృతం అయ్యింది.
తాజా సమాచారం ప్రకారం కబాలి సినిమాలో రజనీకాంత్ ధరించిన దుస్తులు, బూట్లు, వాడిన కార్లు, ఇతర వస్తువులని త్వరలో వేలానికి పెట్టబోతున్నట్లు  తెలుస్తోంది. రజనీకాంత్ వస్తువులంటే సహజంగానే ఆయన అభిమానులు పోటీ పడి మరీ కొనుక్కుంటారు. కనుక చాలా భారీ మొత్తమే సమకూరవచ్చు. దానిని కబాలి డిస్ట్రిబ్యూటర్లకి పంచి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమని ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన రజనీకాంత్, ముగింపు దశలో ఇటువంటి సినీ కష్టాలు ఎదుర్కోవలసి రావడం చాలా బాధాకరమే.
ఆయన సృష్టించుకొన్న ఇమేజ్ చట్రంలో చివరకి ఆయనే బందీ అయిపోయినందునే ఈ సమస్య ఏర్పడిందని చెప్పక తప్పదు. ఊరు పేరు తెలియని చిన్నహీరోలు, నిర్మాతలు, దర్శకులు చిన్న సినిమాలతో పేరుకి పేరు, లాభాలు ఆర్జిస్తుంటే, రజనీకాంత్ సినిమాలపై వందల కోట్లు రూపాయలు ఖర్చు చేసి, చివరికి విమానాల మీద కూడా పోస్టర్లు అంటించి ప్రచారం చేసుకొన్నా ఇటువంటి పరిస్థితికి చేరుకోవడం ఆయన అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది.