ప్రముఖ నటి జ్యోతి లక్ష్మి మృతి

ఒకప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులని తన నటనతో, డాన్సుల హొయలుతో పులకింపజేసిన జ్యోతిలక్ష్మి (53) ఈరోజు తెల్లవారు జామున చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుమారు వెయ్యికి పైగా సినిమాలలో నటించిన జ్యోతి లక్ష్మి, ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలలో కూడా తన ఉనికి చాటుకున్నారు. ఆమె ఎక్కువగా వ్యాంప్ పాత్రలని పోషించినప్పటికీ  వాటికీ తన నటనతో, హావభావాలతో ఒక ప్రత్యేకతని సమకూర్చి పెట్టి, సినిమాలలో ఆ పాత్ర కూడా ఉండేలా ఒక తప్పనిసరి పరిస్థితి కల్పించగలిగారు. నేటికీ మన సినిమాలలో అదే ట్రెండ్ కొనసాగుతోందంటే ఆ క్రెడిట్ ఆమెకే సొంతం అని చెప్పక తప్పదు.

మోసగాళ్ళకి మోసగాడు వంటి కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు కూడా పోషించినప్పటికీ, ఆమె చేసిన డ్యాన్సులే ఆమెకి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. గాంధర్వ కన్య, సీతారాములు, బెబ్బులి, బాబులుగాడి దెబ్బ, స్టేట్‌ రౌడీ, బిగ్‌బాస్‌, కలుసుకోవాలని, దొంగరాముడు అండ్‌ పార్టీ, బంగారు బాబు వంటి అనేక సినిమాలలో ఆమె నటించారు. దక్షిణాది సినీ ప్రముఖులు ఆమె మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.