శ్రీ రస్తు శుభమస్తు ట్రైలర్ టాక్: అంతా శుభం

ఏ మాత్రం హైప్ లేకుండా మొదలైన శ్రీ రస్తు శుభమస్తు సినిమా, ఇటీవల విడుదలైన టీజర్ తో కొత్త అంచనాలు పుట్టించుకుంది. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ, ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. టీజర్ లో టైటిల్ సాంగ్ ని, అందమైన లొకేషన్లలో చూపిస్తే, ఈ సారి ట్రైలర్ లో హీరో హీరోయిన్ అల్లు శిరిష్, లావణ్య త్రిపాఠిల మధ్య ఉండే ఫన్నీ సీన్లతో నింపేశారు. ఒక సీన్లో అన్న అని, మరో సీన్ లో తమ్ముడు అని లావణ్య, శిరీష్ ని అనడం సరదాగా అనిపిస్తుంది. కేవలం ఫన్నీ సీన్లతో సరిపెట్టకుండా, ఫ్యామిలీ ఎమోషన్లని కూడా టచ్ చేస్తూ, రావు రమేష్ తో ఒక చక్కని డైలాగ్ చెప్పించారు.


మొత్తానికి, యూత్ తో పాటు, సినిమాని ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా దగ్గర చేసే ప్రయత్నంలో దర్శకుడు పరశురామ్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలే తప్ప, ఒక చిన్న సినిమా, అందులోనూ క్లాస్ సినిమా తీయడం అల్లు అరవింద్ చాలా సంవత్సరాల తర్వాత చేసిన ఫీట్ అనే చెప్పాలి. ఇటీవల సరైనోడు తో పెద్ద కొడుకుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మెగా ప్రొడ్యూసర్, శ్రీరస్తు శుభమస్తు తో చిన్న కొడుక్కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.