కోర్టులో రజినీకాంత్ కబాలి

దేశంలో, దేశం బయట నడుస్తున్న కబాలీ ట్రెండ్ గురించి అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కానున్న కబాలీ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఓ వైపు ఈనెల 22న విడుదలకు కబాలీ సిద్ధమవుతుంటే.. మరోవైపు ఈ సినిమా నిర్మాతలు వెళ్లి కోర్టులో కూర్చున్నారు. కబాలి చిత్రం పై పైరసీ భూతం తన పంజా విసరకుండా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విడుదలకు కేవలం వారం రోజులు ఉండగా కబాలి నిర్మాతలు ఇలా కోర్టులో కేసు వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

దాదాపుగా పాతికేళ్ల తర్వాత పాత రజినీని గుర్తుచేసేలా ఉన్న కబాలీ రికార్డుల సునామీ సృష్టించారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, సినిమాలో రజినీ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ తెలియజేశారు. ఒకవేళ కబాలి సినిమా కూడా పైరసీ బారిన పడితే.. సినిమా కలెక్షన్లపై భారీ ఎఫెక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు. గతంలోనూ రజినీ సినిమాలు పైరసీ బారిన పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి కబాలి పైరసీ భూతం నుండి తప్పించుకుంటుందో లేదో చూడాలి.