చిరు ‘కత్తిలాంటోడు’ కాదట

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్న సినిమాల్లో చిరంజీవి 150వ సినిమా ఒకటి. కాగా ఈ మధ్యన ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చిరంజీవి నటిస్తున్న 150 వ చిత్రం సినిమా పేరు కత్తిలాంటోడుగా ఇప్పటికే జనంలోకి బాగా వెళ్ళిపోయింది. కానీ ఇది ఫైనల్ కాదని , మారుతుందని చెప్పారు చిరు కుమారుడు , నటుడు రామ్ చరణ్ తేజ్. చిరంజీవి ఇమేజికి తగ్గట్లుగా ఓ మంచి టైటిల్  ప్రకటించనున్నారట.

చిరంజీవి నటిస్తున్న 150వ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ తాజాగా చేసిన ఫేస్ బుక్ చ్యాట్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా కత్తి రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటీవిటీకి దగ్గరగా ఉంటుందని.. సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇప్పటివరకు కత్తిలాంటోడు సినిమా టైటిల్‌ను మెంటల్‌గా ఫిక్స్ చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఆ సినిమా టైటిల్ ఏమిటా అని తలలు పట్టుకుంటున్నారు.