
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి మద్దతు లభించింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సమాజ శ్రేయస్సుకు, పచ్చదనానికి తోడ్పడాలన్న ఉద్దేశంతో కెసిఆర్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ పాల్గొంటూ మొక్కలు నాటడం వల్ల కలిగే మంచిని తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, రానా, రకుల్‌ప్రీత్ సింగ్, రాశీఖన్నా, రెజీనా, శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ తదితర స్టార్స్ అంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ తమవంతుగా మొక్కలు నాటారు.
‘హరిత హారం’ కార్యక్రమంలో భార్య స్నేహా, కుమారుడు అయాన్‌లతో కలిసి అల్లుఅర్జున్ పాల్గొన్నాడు. తాను తన కుమారుడితో మొక్కలు నాటించానని… అందరు కూడా తమ పిల్లలతో మొక్కలు నాటించి ఓ మంచి కార్యక్రమానికి నాంది పలకాలని బన్నీ పిలుపునిచ్చాడు. ఇక నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఫొటోలను షేర్ చేశాడు. ఆయన సతీమణి అమల… కూకట్‌పల్లిలో అభిమానులతో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొంది. దగ్గుబాటి రానా నానక్‌రామ్‌గూడలో మొక్కలు నాటాడు. మంచులక్ష్మి కూడా మొక్కలు నాటినట్లు ట్వీట్ చేసింది.