
సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్యపై మరో కేసు నమోదైంది. గతంలో కూడా రజినీకాంత్ భార్య లత పై రెండు కేసులు ఉండటం.. తాజాగా మరో కేసు నమోదు కావడంతో వార్తల్లో నిలిచారు. పైగా సుప్రీం కోర్టు ఆమెకు కోర్టు నోటీసులు పంపించింది. కొచ్ఛాడయాన్ సినిమాకు సంబంధించిన హక్కుల విషయంలో తమను మోసం చేశారని చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్పందించిన ధర్మాసనం లతకు నోటీసులు పంపించింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సమకూర్చిన ఓ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించింది. కొచ్ఛాడయాన్ కోసం 14.9 కోట్ల విలువైన సేవలను అందిస్తే సినిమా రిలీజ్ తర్వాత కేవలం 8.7కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన మొత్తాన్ని ఇవ్వలేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో లత డాక్యుమెంట్ల ఫోర్జరీకి పాల్పడినట్లు మలసూరు గేట్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. వివాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉండే రజినీకాంత్ కు కొచ్ఛాడయాన్, లింగా సినిమాలు అనుకోని షాకిచ్చాయి.