సుమారు 300కు పైగా తెలుగు సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు వినోద్ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో మరణించారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అయన మరణించినట్లు సమాచారం. గుంటూరు జిల్లాలో తెనాలి అయన స్వస్థలం. అసలు పేరు అరిశెట్టి నాగేశ్వరరావు. తెలుగు, తమిళ, హిందీ బాషల సినిమాలలో నటించారు. తెలుగులో కీర్తి కాంతం కనకం, నల్లత్రాచు, వీరవిహారం, టార్జాన్ వంటి సినిమాలలో హీరోగా చేశారు. కానీ హీరోగా సినిమా అవకాశాలు లభించడంలో ఎక్కువ గ్యాప్ వస్తున్నపుడు పెద్ద హీరోల పక్కన విలన్ వేషాలకు అవకాశాలు వస్తున్నప్పుడు వదులుకోవడం ఎందుకని ఆ పాత్రలు చేయడం మొదలుపెట్టారు. ఆ కారణంగా అయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానే స్థిరపడ్డారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో పెద్ద హీరోలందరి పక్కన అయన నటించారు. చంటి, ఇంద్ర, లారీ డ్రైవర్ వంటి అనేక తెలుగు సినిమాలలో నటించారు.