
నందమూరి నటసింహం, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకొన్నారని వార్తలు వచ్చాయి. అయితే.. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కానీ తనకు ఏమీ అవ్వలేదని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తుండగా.. పూలమాల వచ్చి అద్దం మీద పడడంతో.. రోడ్డు సరిగా కనిపించక డివైడర్ ను గుద్దానని, కారు టైరు బ్లాస్ట్ అవ్వడం మినహా నష్టమేమీ జరగలేదని తెలిపారు. కారు ప్రమాదం జరిగిన వెంటనే బాలకృష్ణ తన అనుచరుల సహాయంతో మరో కారులో బెంగళూరు వెళ్లిపోయినట్లు సమాచారం.
బాలకృష్ణ కూతురు ఈ ఘటనపై తన సోషల్ మీడియా సైట్ లో ప్రకటన చేశారు. తన తాత నందమూరి తారకరామారావు ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల నాపై చూపించే ప్రేమే శ్రీరామరక్షగా తన తండ్రి సురక్షితంగా ఇంటికి చేరుకోగలిగారని నారా బ్రహ్మిణి పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదం నుండి బాలకృష్ణ ఎలా బయటపడ్డారు అన్నదాని మీద ఆసక్తికర చర్చసాగుతోంది. బాలకృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మూలాన ప్రమాదం నుండి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారని, ముందు నుండి డిసిప్లెన్ పాటించే బాలకృష్ణకు ఇప్పుడు అదే కాపాడింది అని అందరూ చర్చించుకుంటున్నారు.