
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి సినిమాలు వరుస హిట్స్‌గా నిలవడంతో తన తరువాత సినిమావైపు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. భక్తిరస చిత్రాలకు కేరాఫ్‌గా ఉన్న నాగార్జున-రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో, మరో భక్తిరస సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘ఓం నమో వెంకటేశాయ’ అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండీ ఈ సినిమా కోసం టాలీవుడ్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. పక్కా ప్లానింగ్‌తో స్క్రిప్ట్ పనులతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.
ఇక జూలై 2న ఓం నమో వెంకటేశాయ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. గతంలో ఈయన తెరకెక్కించిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి వంటి భక్తిరస చిత్రాల్లో నటించిన అక్కినేని నాగార్జున, మరోసారి అదే ఫార్ములాతో మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. వెంకటేశ్వర స్వామికి వీర భక్తుడైన హతి రామ్ బాబా పాత్రలో నాగ్ నటించనున్న విషయం తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా మరో అన్నమయ్య అవ్వడం ఖాయం అని చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.