షామిలి ‘కోడి’ పారిపోయింది!

ఓయ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన షామిలి, ఆ తరువాత మళ్లీ ఏ సినిమాలో కూడా దర్శనమివ్వలేదు. తన బావ అజిత్ సలహాతో అమెరికాకు వెళ్లి మరీ అక్కడ ఫిల్మ్ ఇన్‌స్టిస్యూట్‌లో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంది. ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చిన ఈ బుల్లి అంజలి, తన నటనతో ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తోంది. ఈ క్రమంలో తన రీఎంట్రీ పై దృష్టి సారించిన షామిలికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో అజిత్ మళ్లీ రంగంలోకి దిగాల్సివచ్చింది. షామిలికి సినిమా ఆఫర్లు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించాడు అజిత్.

రీ ఎంట్రీ తరువాత షామిలికి కోలీవుడ్‌లో రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. షామిలి నటించిన వీరశివాజీ చిత్రం షూటింగ్ పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. మరో సినిమా ఆఫర్ షామిలికి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కోడి సినిమాలో హీరోయిన్‌గా ముందు షామిలిని అనుకున్నారు. అయితే స్కిన్‌షో చేయడానికి ఇష్టపడని ఆమెను తప్పక తప్పించాల్సి వచ్చిందని ధనుష్ అండ్ టీమ్ చెప్పుకొచ్చారు. కానీ దీని వెనుక అసలు కథ వేరే ఉందని చెబుతున్నాయి కోలీవుడ్ వర్గాలు. ధనుష్‌కు మంచి స్నేహితుడైన విజయ్, కోడి సినిమాలో షామిలి సూట్ అవ్వదని చెప్పడంతో ధనుష్ ఆమెను తప్పించాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం తమిళ ఇండస్ట్రీలో అజిత్‌కు ఉన్న ఏకైక పోటీ విజయ్ కావడమే. ఈ విధంగా అజిత్ మరదలు షామిలి సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేయించి అజిత్‌పై గెలచే ప్రయత్నం చేశాడట విజయ్. లోగుట్టు పెరుమాళుకే ఎరుక అంటున్నారు తమిళ తంబీలు.. పాపం షామిలి!