
శ్రీకాంత్ అడ్డాల.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోకు బ్రహ్మోత్సవం సినిమాతో కోలుకోలేని ఫ్లాప్ మూటగట్టిన డైరెక్టర్‌గా పేరుగాంచాడు. కేవలం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే తీస్తానంటూ గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఇదే డైరెక్టర్.. ఈ ఏడాదిలోకెల్లా అతి పెద్ద డిజాస్టర్ సినిమాను రూపొందించాడు. ఇక మహేష్ కూడా బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్‌తో డీలా పడి, ఆ ఎఫెక్ట్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇలాంటి డైరెక్టర్‌కు తెలిసి తెలిసి ఎవరైనా ఛాన్స్ ఇస్తారా... అంటే నేను ఇస్తాను అంటున్నాడు దిల్ రాజు.
టాలీవుడ్‌లో స్టార్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రీబ్యూటర్‌గా మంచి పేరున్న ఈయన, వరుస సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు డిస్ట్రిబ్యూషన్ పనులు కూడా చేసుకుంటున్నాడు. బ్రహ్మోత్సవంతో కెరీర్ డైలమాలో పడ్డ శ్రీకాంత్ అడ్డాలను ఆదుకోవడానికి రెడీ అంటూ ముందుకొచ్చాడు దిల్ ఉన్నరాజు. శ్రీకాంత్ మంచి స్క్రిప్ట్‌తో వస్తే, తనతో సినిమా చేయడానికి నేను రెడీగా ఉన్నానంటూ టాలీవుడ్‌లో బాంబు పేల్చాడు. భారీ డిజాస్టర్‌తో టాలీవుడ్‌లో పరువు పోగొట్టుకున్న ఈ డైరెక్టర్‌కు మళ్లీ అవకాశం ఇవ్వడమంటే చాలా పెద్ద రిస్క్ చేయడమే అని హెచ్చరిస్తున్న కొంత మందికి, రిస్క్ చేయడమే తనకు ఇష్టమని వారికి సమాధానం ఇస్తున్నాడు దిల్ రాజు. మరి ఈ అవకాశాన్ని శ్రీకాంత్ అడ్డాల సరిగ్గా ఉపయోగించుకుని హిట్ కొడతాడా లేదో అనేది చూడాలి.