కబాలి సినిమాకు అరుదైన గౌరవం!

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా  టీజర్ వరల్డ్‌ వైడ్‌గా ఎంతటి రికార్డు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కబాలి ఆడియో కూడా సూపర్ హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. రజినీకాంత్‌కు కేవలం ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కబాలి సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. యూరప్ దేశాల్లో అతిపెద్ద థియేటర్‌లో కబాలి సినిమా ప్రీమియర్ షో ను ప్రదర్శించనున్నారు.

జూలై 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న కబాలి సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా ప్యారిస్‌ లోని ది గ్రాండ్ రెక్స్ థియేటర్‌లో ప్రీమియర్ వేయడం జరుగుతుంది. ఓ ఇండియన్ సినిమాను ది గ్రాండ్ రెక్స్‌లో ప్రీమియర్ షో నిర్వహించడం విశేషం అని చెప్పొచ్చు. సుమారు 2000 సీటింగ్ ఉన్న ఈ థియేటర్‌లో కబాలి సినిమాను చూడటానికి జనం ఎగబడతారు అని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న కబాలి సినిమా కలెక్షన్లతో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని కోలీవుడ్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ప్రముఖ తమిళ నిర్మాత కళైపులి థాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కబాలి సినిమాలో, రజినీకాంత్ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుంది.