వీర రాఘవ కత్తిలాంటి డైలాగ్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా అంటే ఒకప్పుడు లెక్క వేరేలా ఉండేది. కత్తులు నూరడం, తలలు తెగ నరకడం అమ్మతోడు అంటూ డైలాగులు చెప్పడం. రొటీన్ అనుకున్నాడో ఏమో ఆ పద్ధతి పూర్తిగా మార్చేసి ట్రెండ్ కు తగినట్టుగా సినిమాలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం కెరియర్ మంచి జోష్ లో నడుస్తుండగా అభిమానులు ఇచ్చిన ధైర్యంతో మళ్లీ కత్తి పట్టేశాడు జూనియర్. 

త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో ఫస్ట్ లుక్ తోనే సర్ ప్రైజ్ ఇచ్చాడు. సిక్స్ ప్యాక్ బాడీతో కత్తి రక్తపు మరకలతో అబ్బో మాస్ ఆడియెన్స్ కు మంచి ఫుల్ మీల్స్ పెట్టేలా ఈ సినిమా ఉంటుందని ఫస్ట్ లుక్ తోనే చెప్పేశాడు త్రివిక్రం. ఇక ఈ సినిమా నుండి ఓ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

మాది రాయలసీమ.. నమ్మితే ప్రాణాలు ఇస్తాం.. నమ్మకద్రోహం చేస్తే ప్రాణాలు తీస్తాం.. అన్న డైలాగ్ సినిమా నుండి లీక్ అయ్యింది. ఈ డైలాగ్ విన్న తారక్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.