
వై.ఎస్.ఆర్ బయోపిక్ గా మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా యాత్ర. దేశ రాజకీయ చరిత్రలో నిలిచిన మహానేత వై.ఎస్సార్. నిండు వేసవి మండుటెండలో 60 రోజులు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన గొప్ప నేత రాజశేఖర్ రెడ్డి. ఆ పాదయాత్రలోనే ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. రైతుల కోసం.. విద్యార్ధుల కోసం ఇలా ప్రజల బ్రతుకులు బాగు పడేలా ప్రభుత్వ పథకాలు తెచ్చిన జననేత ఆయన.
వైఎస్ జీవిత చరిత్ర సినిమాగా వస్తుందని తెలియగానే అభిమానులంతా ఉత్సాహంగా ఉన్నారు. సినిమాలో వై.ఎస్.ఆర్ గా లెజెండరీ యాక్టర్ నేషనల్ అవార్డ్ విన్నర్, 350కు పైగా సినిమాలను చేసిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. 2017లో ఆనందో బ్రహ్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహి వి రాఘవ్ ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.
రిలీజ్ అయిన థీం పోస్టర్ తో పాటుగా మమ్ముట్టి వైఎస్ లుక్ బయోపిక్ మీద అంచనాలను పెంచేసింది. ఈ సోమవారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.