తెరాస కార్పొరేటర్ దారుణహత్య

తెరాస కార్పొరేటర్ అనిశెట్టి మురళి దారుణ హత్యకు గురయ్యారు. వరంగల్లో 44వ డివిజన్ కార్పొరేటర్ మురళిని గురువారం మద్యాహ్నం కుమార్ పల్లిలో కొంతమంది దుండగులు కత్తులతో దాడి చేసి అతికిరాతకంగా నరికి హత్య చేశారు. మురళి మొదట తెదేపాలో ఉండేవారు. తరువాత తెరాసలో చేరి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. అతను గతంలో బెన్ని అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడుగా ఉన్నారు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం చేత కోర్టు ఆయన నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. మురళిని హత్య చేసిన తరువాత ఆ దుండగులు హన్మకొండ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మురళి శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.