తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిన్నటి నుంచి ప్రారంభించిన 3వ విడత హరితహారం కార్యక్రమం గురించి పేపర్లు, టీవీ ఛానళ్ళలలో ప్రచారం చేసుకోవడం, ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ని అశోక చక్రవర్తితో పోల్చుతూ తెరాస నేతలు గొప్పలు చెప్పుకోవడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతీ ఏటా మొక్కలునాటే కార్యక్రమం చేపట్టేదని కానీ ఏనాడూ ఈవిధంగా తెరాసలాగ గొప్పలు చెప్పుకోలేదని, ప్రచారం చేసుకోలేదని అన్నారు. ఇంతకు ముందు రెండు విడతలలో వేసిన మొక్కలలో ఎన్ని బ్రతికి ఉన్నాయో తెరాస సర్కార్ చెప్పాలని వి హనుమంతరావు అన్నారు. తెరాస సర్కార్ ఎంతసేపు ప్రచారయావే తప్ప ఏ పని చిత్తశుద్ధితో పనిచేసే అలవాటులేదని వి హనుమంతరావు అన్నారు. హరితహారం గురించి అది చేసుకొంటున్న ప్రచారం చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుందని అన్నారు.
హరితహారం కార్యక్రమం తెరాస స్వంత కార్యక్రమంలా సాగుతోందే తప్ప దానిలో ప్రజలను భాగస్వాములుగా చేయడం లేదని ఆరోపించారు మాజీ ఎంపి పొన్నాల ప్రభాకర్. కరీంనగర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం ఎంపిక చేసిన ప్రజలనే అనుమతించారని, మిగిలిన వారిని సిఎం బహిరంగసభకు హాజరు కాకుండా పోలీసులు అడ్డుకొన్నారని పొన్నాల విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు తనను వ్యతిరేకిస్తున్నారనే కారణంతో యూనివర్సిటీలో నిరంతరంగా పోలీసులను మొహరించి విద్యార్ధులను నిర్బందిస్తున్నారని పొన్నాల ఆరోపించారు.