కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ దెబ్బకు గోపాలపురం ఎసిపి శ్రీనివాస్ రావుపై బదిలీ వేటు పడింది. ఇటీవల బోనాల పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ తన అర్ధాంగితో కలిసి కారులో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. కేంద్రమంత్రి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం గుడి ద్వారం వరకు ఆయన కారును అనుమతించాలి. కానీ ఆ సమయంలో గుడి వద్ద చాలా రద్దీగా ఉన్నందున ఆయన కారును గుడికి చాలా దూరంలో ఆపివేశారు. కానీ అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వారి కార్లను గుడి ద్వారం వరకు అనుమతించారు.
బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రి అని తెలిసి కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఆయనను అవమానించారని, ఇందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని భాజపా లేఖ వ్రాసింది. దానిపై స్పందించిన నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి అధనపు కమీషనర్ శ్రీనివాసరావుతో విచారణ జరిపించి గోపాలపురం ఎసిపి శ్రీనివాస్ రావును నగర పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పోలీస్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము వంటిదని ఊరికే అనలేదని ఈ సంఘటన చూస్తే అర్ధం అవుతుంది.