.jpg)
తెలంగాణా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతల విమర్శలకు జవాబిస్తూ “తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పైనప్పటికీ మన కాంగ్రెస్ నేతలు ఇంకా సమైక్యవాదులలాగే వ్యవహరిస్తున్నారు. వారిలో బానిస లక్షణాలు ఇంకా పోలేదు,” అని విమర్శించారు.
తెలంగాణా భవన్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, “పులిచింతల ప్రాజెక్టు వలన ఏపికే ప్రయోజనం ఉంటుంది కానీ తెలంగాణాకు ఉండదని మేము ఉద్యమ సమయంలోనే చెప్పాము. అది ఆంధ్రాకు ఉపయోగ పడుతుంది కనుకనే ఆంద్రా పాలకులు దాని నిర్మాణం పూర్తి చేశారు. కానీ తెలంగాణాకు మేలు కలిగించే జూరాల్ హైడల్ ప్రాజెక్టు మాత్రం పూర్తి చేయలేదు. దానిని పూర్తి చేసి ఉండి ఉంటే తెలంగాణా ఏర్పడిన తరువాత అంత విద్యుత్ సంక్షోభం ఎదుర్కోవలసి ఉండేది కాదు. ఆ ప్రాజెక్టును ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. వారి నిర్వాకం వలన తెలంగాణా రాష్ట్రానికి సుమారు రూ.1,000 కోట్లు నష్టం వచ్చింది. మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఉత్తం కుమార్ రెడ్డికి కూడా ఈ విషయలన్నీ తెలుసు కానీ అవేవీ తెలియనట్లుగా పులిచింతల ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆయన అచ్చమైన సమైక్యవాదిలాగ మాట్లాడుతున్నారు. నేటికీ వారిలో ఇంకా ఆ బానిస లక్షణాలు పోలేదు. మీరు రాష్ట్రానికి మేలు చేయకపోయినా పరువాలేదు కానీ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడకుండా ఉంటే అంతే చాలు. మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే వారి గత చరిత్రలు అన్ని త్రవ్వి తీయవలసివస్తుంది,” అని హెచ్చరించారు.