2.jpg)
టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేటి నుంచి మూడు రోజులపాటు అమరవీరుల స్ఫూర్తి యాత్ర చేస్తారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద నుంచి ఈ రెండవ విడత స్ఫూర్తియాత్ర మొదలుపెట్టి సిరిసిల్లా రాజన్న జిల్లాలో 10వ తేదీన ముగిస్తారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ, “దేనికోసమైతే పోరాడి తెలంగాణా సాధించుకొన్నామో ఆ ఉద్యమ ఆకాంక్షలను తెరాస సర్కార్ పట్టించుకోకుండా నిరంకుశంగా పరిపాలన సాగిస్తోంది. ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినవారిని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తున్నారు. తెరాస సర్కార్ ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయకుండా తెరాస నేతల స్వార్ధప్రయోజానాల కోసమే పనిచేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫీయాను అరికట్టడానికి ప్రయత్నించకపోగా వాటిని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయింది. తెరాస సర్కార్ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడంలో విఫలమయింది. అందుకే దానిని గట్టిగా ప్రశ్నించవలసివస్తోంది. ఇంత తక్కువ కాలంలోనే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతాయని ఊహించలేకపోయాము,” అని అన్నారు.