కేసీఆర్ వాళ్ళకు అపాయింట్ ఇవ్వరా?

ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రులు సచివాలయం నుంచే పరిపాలన చేస్తుంటారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి మాత్రం ప్రగతి భవన్ నుంచే చేస్తుంటారు. అక్కడికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను రప్పించుకొని వారితో సమావేశం అవుతుంటారు. అక్కడికే ఫైల్స్ అన్నీ తెప్పించుకొని సంతకాలు చేస్తుంటారు. అందుకే వి హనుమంతరావు వంటి ప్రతిపక్ష నేతలు ప్రజల కోసం తెలంగాణా సాధిస్తే, కేసీఆర్ దానిని జమిందారీ వ్యవస్థగా మార్చేశారని విమర్శిస్తుంటారు.    

అయితే కేసీఆర్ ప్రగతి భవన్ లో నుంచి కాలుబయట పెట్టకపోయినా పరిపాలనకు ఎటువంటి ఆటంకం కలగడం లేదు కనుక ఆయనను నిందించవలసిన అవసరం లేదు. కానీ నిన్న ప్రతిపక్ష నేతలు ఆయనను కలవడానికి వస్తే వారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోగా పోలీసులు అరెస్ట్ చేయడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ధర్నాచౌక్ ను ఇందిరాపార్క్ నుంచి తరలించవద్దని కోరుతూ ధర్నా చౌక్ పరిరక్షణ కమిటి నేతలు గత నెలరోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడంతో వారు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి పత్రం ఇచ్చేందుకు గురువారం ప్రగతి భవన్ వద్దకు వచ్చారు. ఆ సంగతి తెలుసుకొన్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయినవారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కమిటీ కో కన్వీనర్ ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు తదితరులున్నారు. వారందరూ ఉగ్రవాదులు కారు..సంఘ వ్యతిరేకశక్తులు కారు. ఒక ప్రజాసమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు వచ్చారు. వారితో మాట్లాడితే ముఖ్యమంత్రి గౌరవం పెరుగుతుందే తప్ప తగ్గదు. కానీ ఆయన వారిని ఎందుకు కలవకూడదనుకొన్నారో ఆయనకే తెలియాలి. కానీ ఆయన నిర్ణయం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. 

చాడా వెంకట రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినవారిని అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందా లేక పోలీస్ రాజ్యం నడుస్తోందా? ఇంత నిరంకుశపాలన ఎన్నడూ చూడలేదు,” అని అన్నారు.

ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, “ప్రజల నిరసనలను ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రాచరిక పోకడలను ప్రదర్శిస్తున్నారు. ఆయన ఈ నిరంకుశ వైఖరిని ప్రజలకు వివరించుతాము. ధర్నా చౌక్ ను ఎత్తివేయడం వలననే ఇప్పుడు ప్రగతి భవన్ ముందు ధర్నాలు చేయవలసి వస్తోంది,” అని అన్నారు.

తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, “ధర్నాచౌక్ ను ఎత్తివేస్తే ప్రజాఉద్యమాలు ఆగిపోతాయని కేసీఆర్ అనుకొంటే అది భ్రమే. అసలు ధర్నా చౌక్ ను ఎందుకు ఎత్తివేయలనుకొంటున్నారో జవాబు చెప్పలేక స్థానిక ప్రజలు అభ్యంతరాలు చెపుతున్నారని చవుకబారు రాజకీయాలు చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఆయన తన నిర్ణయం ఉపసంహరించుకోవాలి. లేకుంటే దాని గురించి ప్రతిపక్షాలతో మాట్లాడేందుకు సిద్దపడాలి,” అని అన్నారు.