సిక్కింలో గత నెలరోజులుగా భారత్-చైనా సైనికుల మద్య ఘర్షణవాతావరణం నెలకొని ఉంది. ఇరుదేశాలు 3,000 మంది సైనికులను ఆ ప్రాంతంలో ఎదురెదురుగా మొహరించి ఉంచడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదని దానిలోకి చొచ్చుకు వచ్చిన భారత సైనికులు తక్షణం వెనక్కు వెళ్ళాలని లేకుంటే బయటకు తరిమికొడతామని చైనా హెచ్చరిస్తోంది. దానికి భారత రక్షణ శాఖ సహాయమంత్రి సుబాష్ భమ్రే చాలా ఘాటుగా స్పందించారు.
ఆయన నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఇది మా దేశభద్రతకు సంబంధించిన విషయం. కనుక మేము మా స్థానం నుంచి కదిలేది లేదు. ముందుగా చైనా సైనిక దళాలు మునుపున్న స్థానానికి తిరిగి వెళ్ళాలి. వారే భూటాన్ భూభాగంలోకి చొరబడ్డారు. అది సరికాదు. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఈ సమస్యపై మా వైఖరి ఇదే,” అని అన్నారు.