ఖమ్మం మిర్చి యార్డు తరలింపు విషయంలో అధికార తెరాస, వామపక్షాల నేతల మద్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న గొడవలు బుధవారం ఒకరినొకరు కొట్టుకోనేంతవరకు వెళ్ళాయి. మిర్చి యార్డును రఘునాథ పాలెం తరలించాలని తెరాస నేతలు పట్టుబడుతుంటే, గుర్రంపాలెంకు తరలించాలని వామపక్షాల నేతలు పట్టుబడుతున్నారు. బుధవారం ఇరువర్గాలు మిర్చి యార్డు వద్ద ఘర్షణపడి కార్యాలయంలో ఫర్నీచర్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను ద్వంసం చేశారు. గత పది రోజులుగా వారు ఈవిషయంలో గొడవ పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు జోక్యం చేసుకోవడానికి సాహసించలేకపోతున్నారు. కనుక జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు జోక్యం చేసుకొని పరిష్కరిస్తే బాగుంటుందని మిర్చి వ్యాపారులు, యార్డు అధికారులు చెపుతున్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని నేతలు యార్డు తరలింపు కోసం కీచులాడుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.