పాతనోట్ల మార్పిడిపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు

గత ఏడాది నవంబర్ 8వ తేదీన పాత రూ.500,1,000 నోట్లు కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తరువాత వాటిని మార్చుకోవడానికి డిశంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఏ కారణాల చేతైనా మార్చుకోలేని వారి కోసం మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అందుకోసం రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన తగిన కారణాలు, ఆధారాలు చూపినవారికి పాతనోట్లను మార్చుకొనే వెసులుబాటు కల్పిచింది. అయినా కూడా ఇంకా అనేక మంది వివిధ కారణాల వలన తమ వద్ద ఉన్న ఆ పాతనోట్లను గడువులోగా మార్చుకోలేకపోయారు.

వాటిని ఇప్పుడు ఎక్కడా మార్చుకొనే వీలులేకపోవడంతో అవి చిత్తుకాగితాలతో సమానమయ్యాయి. నల్లకుభేరులు అందుకు బాధపడినా పట్టించుకోనవసరం లేదు కానీ కష్టపడి సంపాదించుకొని దాచుకొన్నవారికి అది చాలా బాధ కలిగించే విషయమే. కానీ ప్రభుత్వంతో పోరాడే శక్తిలేక చాలామంది ఆ పాతనోట్లను బయట పడేయలేక, ఇంట్లో దాచుకోలేక బాధ పడుతున్నారు.

పాతనోట్ల మార్పిడిగడువు పెంచాలని కోరుతూ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం (పిల్) దాఖలైంది. దానిని విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ, సరైన ఆధారాలు, కారణాలు చూపించిన వారికి రద్దయిన పాతనోట్లను మార్చుకొనేందుకు మరొక అవకాశం కల్పించాలని రద్దైన పాతనోట్లను స్వీకరించాలని కేంద్రప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ని ఆదేశించింది. నోట్లరద్దు వలన నిజాయితీపరులు నష్టపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. వారు నష్టపోకుండా చూడాల్సిన భాద్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఇదివరకు పాత నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి ఏర్పాట్లు చేసిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై జూలై 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది ఆరోజుకు కేసు విచారణను వాయిదా వేసింది. 

సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపద్యంలో పాతనోట్లను మార్చుకొనేందుకు మళ్ళీ మరో అవకాశం కలుగవచ్చు. కనుక ఇంకా ఎవరి వద్దనైనా పాతనోట్లు ఉన్నట్లయితే వాటిని అక్రమ మార్గాలలో మార్చుకొనే ప్రయత్నాలు చేయకుండా సుప్రీం కోర్టు తుది తీర్పు వెలువరిచే వరకు ఎదురు చూడటం మంచిది.