టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెరాస సర్కార్ పై మళ్ళీ విమర్శలు గుప్పించారు. హన్మకొండలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో కలిపి కనీసం రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి. తెరాస అధికారంలోకి వస్తే ఆ ఉద్యోగాలన్నిటినీ భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. కానీ మూడేళ్ళు పూర్తయినా ఇంతవరకు కనీసం 20,000 మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇక వాల్ మార్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలకు ఆహ్వానం పలుకడం ద్వారా రాష్ట్రంలో చిన్నచిన్న వ్యాపారులు, దుఖాణాల యజమానులు కూడా రోడ్డున పడే పరిస్థితి కల్పిస్తోంది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జి.ఎస్.టి. దెబ్బకు వారు ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. జి.ఎస్.టి. వలన ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది,” అని అన్నారు.
తెలంగాణా ఏర్పడితే దేశంలోనే ధనిక రాష్ట్రంగా అవతరిస్తుందని తాను చెప్పిన మాట నిజమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ నేటికీ పదేపదే చెపుతుంటారు. తెలంగాణా ఉద్యమాలకు మూడు ప్రధాన కారణాలలో ఉద్యోగాలు కూడా ఒకటి. తెలంగాణా ఏర్పడితే ఆంధ్రా ఉద్యోగులు అందరూ ఆంధ్రాకు వెళ్ళిపోతారని అప్పుడు ఆ ఉద్యోగాలన్నీ మన పిల్లలకే దక్కుతాయని కేసీఆర్ అనేవారు. అవికాక కనీసం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. తెలంగాణా ధనిక రాష్ట్రంగా అవతరించడంపై కేసీఆర్ చెప్పిన జోస్యం ఫలించినప్పుడు, ఉద్యోగాల విషయంలో అయన చెప్పిన జోస్యం ఎందుకు ఫలించలేదని నిరుద్యోగులు అడుగుతున్నారు. ఆ మాట చెప్పిన ఆయనే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారు కూడా ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.