తెదేపా నేతలకు తెరాస స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ  కేసులున్నాయని, వాటిపై ఆయనను ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు నాలుగుసార్లు హైదరాబాద్ వచ్చివెళ్ళారని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఊహించినట్లుగానే తెరాస చాలా ఘాటుగా స్పందించింది. తెరాస ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

“ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిబిఐ  కేసులున్నాయని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను మేము ఖండిస్తున్నాము. ఆయన తన ఆరోపణలకు సాక్ష్యాధారాలు చూపాలి. నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తానంటే కుదరదు. ఎవరు అవునన్నా కాదన్నా కేంద్రప్రభుత్వం జి.ఎస్.టి. అమలుచేయడానికి సిద్దపడుతోంది కనుకనే మేము దానికి మద్దతు ఇచ్చాము తప్ప ఎవరికో భయపడి కాదు. అప్పుడు కూడా తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకొన్నాము. తెలంగాణాలో తెదేపా నేతలు జి.ఎస్.టి.ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంటే అక్కడ ఏపిలో తెదేపా నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జి.ఎస్.టి.కి మద్దతు ఇస్తున్నామని గట్టిగా చెపుతుంటారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై కూడా వారు అలాగే ద్వంద వైఖరితో మాట్లాడుతున్నారు. వారిది పేరుకు జాతీయ పార్టీ కానీ అక్కడొకలాగ, ఇక్కడ మరొకలాగ మాట్లాడుతున్న తెదేపా నేతలను చూస్తుంటే వారి పార్టీకి ఒక స్పష్టమైన విధానం లేదని అర్ధం అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా రాంనాథ్ కోవింద్ ను ఎంపిక చేసిన సంగతి తెదేపా నేతలకు తెలియదు కనుకనే పిచ్చి కూతలు కూస్తున్నారు. వారు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏదో ఒకరోజున ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళకతప్పదు,” అని హెచ్చరించారు.