అటువంటి చెడ్డ పనులు మనకొద్దు: మోడీ

గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మీడియాతో మాట్లాడుతూ, “గోవులను రక్షించే పేరుతో సాటి మనుషులను కొట్టడం, చంపడం చాలా తప్పు అనాగరిక చర్య. గోరక్షక్  పేరిట చట్టాన్ని తమ చేతిలో తీసుకోవడం తప్పు. మనది అహింసా సిద్ధాంతాన్ని పాటించే దేశం. కుక్కలకు, చేపలకు కూడా ఆహారం పెట్టే గొప్ప సంస్కృతి మనది. గోరక్షక్ పేరుతో దేశంలో జరుగుతున్న హింసాకాండ వలన మన దేశానికి చెడ్డపేరు వస్తోంది. గోవులను తప్పకుండా రక్షించవలసిందే. కానీ దానికోసం సాటి మనుషులపై దాడులు చేయడం సరికాదు. మహాత్మాగాంధీ, ఆచార్య వినోబా భావే వంటివారిని ఆదర్శంగా తీసుకొని ఆ పని చేయాలి. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలకు మనం ఈవిధంగానేనా రుణం తీర్చుకొనేది? గోరక్షక్ పేరుతో ఎవరిపైనైనా దాడులు చేస్తే సహించేది లేదు. వారిపై కటిన చర్యలు తీసుకొంటాము,” అని మోడీ హెచ్చరించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ఈ మాటలు చెప్పిన కొన్ని గంటలకే ఝార్ ఖండ్ రాష్ట్రంలో రాంఘర్ పట్టణంలో సుమారు 30 మంది వ్యక్తులు కలిసి ఆవు మాంసం తీసుకు వెళుతున్నాడనే అనుమానంతో మొహమ్మద్ అలీముద్దీన్ అనేవ్యక్తిపై పట్టపగలు నడిరోడ్డుపై దాడి చేశారు. ఆ దెబ్బలకు అతను అక్కడే చనిపోయాడు. ఎస్.పి. కిషోర్ కౌశల్ మీడియాతో మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఆ వాహనంలో ఆవు మాంసం రవాణా చేస్తున్నారనే అనుమానంతో కొందరు వ్యక్తులు మొహమ్మద్ అలీముద్దీన్ పై దాడి చేయడంతో అతను చనిపోయాడు. అతనిపై దాడి చేసినవారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటాము,” అని చెప్పారు.