వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న సింగరేణి జాతీయ కార్మిక సంఘాలు ఎవరూ ఊహించని విధంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి. సింగరేణి యాజమాన్యం ఇకపై జాతీయ సంఘాల నేతలతో చర్చించబోమని విస్పష్టంగా ప్రకటించడంతో, వారు తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేసి విధులలో చేరి దీనిపై ట్రిబ్యునల్ లో పోరాడుదామని నిర్ణయించారు. అయితే అసలు కారణం సమ్మె చేస్తున్న కార్మికులలో చాలా మంది విధులలో చేరిపోతుండటం చేతనే కార్మిక సంఘాలు అర్ధాంతరంగా సమ్మె విరమించవలసి వచ్చినట్లు సమాచారం. కనుక 10 రోజుల సమ్మె తరువాత చివరికి ఏమీ సాధించకుండానే వారంతట వారే సమ్మెను విరమించుకోవడం విశేషం. వారసత్వ ఉద్యోగాల కోసం ట్రిబ్యునల్ లో పోరాడుతామని వారు చెపుతున్నమాట కేవలం గౌరవప్రదంగా సమ్మె విరమించడానికేనని చెప్పవచ్చు.