ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి మీరా కుమార్

ప్రతిపక్షాలు మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ ను తమ రాష్ట్రపతి అభ్యర్ధిగా రంగంలోకి దింపాయి. దీంతో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఎన్డీయే తరపున రాంనాథ్ కోవింద్ పేరును ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన భాజపాకు ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా గట్టి షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మొదట కొద్దిగా బెట్టు చేసినా చివరకు అవి ఆయనకు తప్పకుండా మద్దతు ఇస్తాయని భాజపా భావించింది. కానీ మీరా కుమార్ ను బరిలోకి దింపడంతో ఈ అత్యున్నత పదవికి కూడా పోటీ అనివార్యం అయ్యింది. మీరా కుమార్ ను ప్రతిపక్ష అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత సిపిఐ (ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ, “ఈ రాజకీయ యుద్ధంలో భారత రాజ్యాంగం విలువలు గెలుస్తాయా లేక ఆర్.ఎస్.ఎస్. దేశాన్ని హిందూదేశంగా మార్చి వేస్తుందా అనేది తేలిపోతుంది,” అని అన్నారు.