తెలంగాణాలో జిల్లాల పునర్విభజన చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలందరికీ ఉద్యోగాల విషయంలో సమన్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనె దానిని కొనసాగించారు. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి మళ్ళీ దానిలో కొత్త జిల్లాలు కూడా ఏర్పడ్డాయి కనుక ఇప్పుడు జోనల్ విధానం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ అది సరైన నిర్ణయం కాదని, నిజాం కాలం నుంచి అమలులో ఉన్న జోనల్ వ్యవస్థను కొనసాగించాలని రాష్ట్ర తెదేపా అధికార ప్రతినిధి దుర్గా ప్రసాద్ అన్నారు. ఒకవేళ దానిని రద్దు చేయాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. ఒకవేళ ప్రభుత్వం దానిని రద్దు చేయాలనుకొంటే పార్లమెంటులో ఆర్టికల్ 371(డి)కి సవరణ చేయించవలసి ఉంటుంది. ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకొని జోనల్ వ్యవస్థ రద్దు చేసేశాము అంటే కుదరదు. ప్రస్తుత పరిస్థితులలో పార్లమెంటులో 371(డి)కి సవరణ చేయడం సాధ్యం కాదు కనుక జోనల్ వ్యవస్థను యధాతధంగా కొనసాగించాలి,” అని అన్నారు.
జోనల్ వ్యవస్థను చట్టప్రకారం రద్దు చేయడం సాధ్యం కాకపోవచ్చు కానీ రాష్ట్ర విభజన తరువాత కూడా దానిని కొనసాగించవలసిన అవసరం ఏమిటో తెదేపా వివరించి ఉండి ఉంటే బాగుండేది. తెలంగాణా ఏర్పాటుకు మూడు ప్రధాన కారణాలలో నియామకాలు కూడా ఒకటి. ఇప్పుడు టి.ఎస్.పి.ఎస్.సి. ఏర్పాటు చేసుకొని స్థానికులని నియమించుకొంటున్నప్పుడు ఇంకా సంక్లిష్టమైన జోనల్ వ్యవస్థను కొనసాగించవలసిన అవసరం ఏమిటి?