తెలంగాణా రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అంటే ప్రధానంగా హైదరాబాద్ పేరే వినిపిస్తుంటుంది. ఐటి మంత్రి కేటిఆర్ చొరవ వలన ఇప్పుడిప్పుడే ఐటి పరిశ్రమ వరంగల్ కు కూడా వ్యాపిస్తోంది. సిద్ధిపేటలో కూడా ఐటి పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేటలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, హైదరాబాద్, వరంగల్ తరువాత శరవేగంగా అభివృద్ధి చెందబోతున్న జిల్లాలలో సిద్ధిపేట మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ కూడా ఐటి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రూ.1,000 కోట్లు పెట్టుబడితో సిద్ధిపేట శివార్లలో ఐటి పరిశ్రమలు రాబోతున్నాయి. దాని కోసం ప్రభుత్వం కొన్ని విదేశీ సంస్థలతో చర్చిస్తోంది. ఐటి పరిశ్రమలే కాకుండా విద్యా, వైద్య రంగాలలో కూడా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నాము. అలాగే జిల్లాను పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మలిచేందుకు ముమ్ముర ప్రయత్నాలు జరుగుతున్నాయి. రంగనాయాక్ సాగర్ సిద్దం అయితే జిల్లా ముఖచిత్రమే పూర్తిగా మారిపోతుంది,” అని అన్నారు.