కొద్ది సేపటిక్రితం భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమ రాష్ట్రపతి అభ్యర్ధి పేరు ప్రకటించారు. ఆయన పేరు రామ్ నాథ్ కోవింద్. దళితుడైన రామ్ నాథ్ ప్రస్తుతం బిహార్ రాష్ట్ర గవర్నరుగా ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో గల డేరా పూర్ లో 1945, అక్టోబర్ 1న జన్మించారు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. తరువాత భాజపాలో చేరి రాజకీయాలలో ప్రవేశించారు. చాలా ఏళ్ళపాటు భాజపా దళితమోర్చా నాయకుడిగా పనిచేశారు.1994-2006 మద్య కాలంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడుగా కొనసాగారు. 2015 నుంచి బిహార్ గవర్నర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
మీడియా, ప్రతిపక్షాలు కూడా ఊహించలేని వ్యక్తి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించి భాజపా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అత్యన్నతమైన పదవికి ఎటువంటి కళంకం లేని వివాదరహితుడైన దళిత అభ్యర్ధిని ఎంపిక చేయడం ద్వారా ప్రతిపక్షాలు సైతం ఆయనను కాదనలేని పరిస్థితి కల్పిపించింది. ఎన్డీయే తన అభ్యర్ధిని ప్రకటించింది కనుక ఇప్పుడు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఆయన అభ్యర్ధిత్వంపై తమ వైఖరిని లేదా తమ అభ్యర్ధిని ప్రకటించవలసి ఉంది. ఈ నెల 23న రామ్ నాథ్ కోవింద్ నామినేషన్లు వేస్తారు.