
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 24న పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన పదవీ కాలంలో మొత్తం 28 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. తాజాగా మరో రెండు పిటిషన్లను తిరస్కరించారు. రెండూ కూడా అత్యాచారం, హత్య నేరాలకు పాల్పదినవారివే కావడం విశేషం. ఐదేళ్ళ క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ పట్టణంలో నాలుగేళ్ళ చిన్నారిని ముగ్గురు యువకులు కలిసి అతిదారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. వారికి కోర్టు మరణశిక్ష విధించింది. చివరి ప్రయత్నంగా వారు రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకొన్నారు కానీ వాటిని ఆయన తిరస్కరించారు. మరొక పిటిషన్ పూణేలో ఒక యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు మరణశిక్ష పడిన ఇద్దరు యువకులది. వారి పిటిషన్ కూడా రాష్ట్రపతి తిరస్కరించారు. కనుక వారందరికీ త్వరలోనే మరణశిక్ష అమలవుతుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలంలో బహుశః ఇవే ఆఖరి పిటిషన్లు కావచ్చు. ముంబై ప్రేలుళ్ళలో దోషులుగా నిర్ధారించబడిన వారికి న్యాయస్థానం మరణశిక్ష విధించినట్లయితే వారి పిటిషన్లు కొత్తగా ఎన్నికయ్యే రాష్ట్రపతి వద్దకు వస్తాయి.