తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో అవరోధం ఏర్పడింది. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన వేములఘాట్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ గ్రామాలకు చెందిన 9 మంది నిర్వాసిత రైతులు జూన్ 31వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ వేశారు. మల్లన్న సాగర్ జలాశయం క్రింద ముంపుకు గురవుతున్న గ్రామాల ప్రజలకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా, పునరావాస చర్యలు చేపట్టకుండానే ప్రభుత్వం నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెడుతోందని వారు తమ పిటిషన్ లో పిర్యాదు చేశారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని వారు తమ పిటిషన్ లో కోరారు. తెలంగాణా, మహారాష్ట్ర సాగునీటి శాఖలు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, కేంద్ర జలవనరుల శాఖలను ప్రతివాదులుగా తమ పిటిషన్ లో పేర్కొన్నారు. వారి పిటిషన్ విచారణకు స్వీకరించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రతివాదులు అందరికీ దీనిపై సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపింది. ఈ కేసును జూలై 25కి వాయిదా వేశారు.
ఈ కేసులో పిటిషనర్లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రమంత్రిత్వ శాఖలను కూడా ప్రతివాదులుగా చేర్చడం ద్వారా కేసును ఇంకా క్లిష్టంగా మార్చేప్రయత్నం చేసినట్లే కనిపిస్తోంది. వారి వెనుక కాంగ్రెస్ నేతలే ఉన్నారని తెరాస ఆరోపిస్తోంది కనుక బహుశః ఇది వారి ఆలోచనే అయ్యుండవచ్చు. కనుక మళ్ళీ దీనిపై కాంగ్రెస్, తెరాసల మద్య మరో యుద్ధం మొదలైనా ఆశ్చర్యం లేదు.