అయితే కమల్ నటించడం మానేస్తాడా?

ప్రముఖ నటుడు కమల్ హాస్సన్ మూడు రోజుల క్రితం చెన్నై ఫిలిం ఛాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ, “సినీ పరిశ్రమపై 28శాతం జి.ఎస్.టి.(పన్ను) విధించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. హాలీవుడ్ సినిమాలతో సమానంగా భారతీయ సినిమాలపై పన్ను విధించడం సరికాదు. వాటికి ప్రపంచమంతా మార్కెట్ ఉంది. కానీ భారతీయ సినిమాలకు చాలా పరిమితమైన మార్కెట్ మాత్రమే ఉంది. దానిపై 28 శాతం పన్ను విధిస్తే సినీ పరిశ్రమ దెబ్బ తింటుంది. కనుక కేంద్రప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని సినీపరిశ్రమపై 5-12శాతం లోపు పన్ను విదించాలని కోరుతున్నాను. ఒకవేళ కేంద్రప్రభుత్వం ఇందుకు అంగీకరించకపోతే నేను సినీ పరిశ్రమ నుంచి తప్పుకొంటాను,” అని అన్నారు.

కమల్ హాస్సన్ హెచ్చరికపై కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ, “దేశంలో వివిధ వస్తు ఉత్పత్తులు, వివిధ సేవలపై జి.ఎస్.టి. కౌన్సిల్ లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకొంది. జి.ఎస్.టి. కౌన్సిల్ సినీపరిశ్రమపై 28శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. మీడియా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినంత మాత్రాన్న సినీపరిశ్రమపై పన్ను తగ్గించడం వీలుకాదు. సినీపరిశ్రమలోవారు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

సినీపరిశ్రమపై పన్ను తగ్గించడం వీలుకాదని అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పేశారు కనుక కమల్ హస్సన్ సినీ పరిశ్రమలో కొనసాగుతారో లేదో చూడాలి.