నిర్వాసితుల ఘోడు పట్టించుకోరేమి?

మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ సిద్ధిపేట జిల్లాలోని వేములఘాట్ వద్ద గత 12 నెలలుగా నిర్వాసిత రీతులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. కానీ తెలంగాణా ప్రభుత్వం మాత్రం వారి గోడును పట్టించుకోకుండా కొట్ట భూసేకరణ చట్టం తెచ్చి బలవంతంగా వారి భూములు గుంజుకొనే ప్రయత్నాలు చేయడం చాలా బాధాకరమని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం టిజెఎసి, కాంగ్రెస్, వామపక్ష నేతలు కలిసి అక్కడ దీక్షలు చేస్తున్న నిర్వాసిత రైతులను కలిసి వారి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.  ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ, “రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వమే బలవంతంగా వారి భూములను గుంజుకోవడం చాలా దురదృష్టకరం. ఒకవేళ తప్పనిసరిగా భూసేకరణ చేయవలసి వస్తే భూసేకరణ చట్టం-2013 ప్రకారమే చేయాలి తప్ప తన ఇష్టం వచ్చినట్లు కాదు. అసలు గ్రామసభలు ఏర్పాటు చేసి వాటి ఆమోదం లేకుండా భూసేకరణకు పూనుకోవడమే చాలా తప్పు. ఇదివరకు 1.5 టిఎంసి సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ ఉంటే సరిపోతుందని అని అంచనా వేశారు. మరి ఇప్పుడు 50 టిఎంసి సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్ ఎందుకు నిర్మించాలనుకొంటోంది?” అని ప్రశ్నించారు. 

మల్లనసాగర్ నిర్వాసితుల తరపున కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంతో గట్టిగానే పోరాడుతోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రొఫెసర్ కోదండరామ్ పోరాడుతున్నందున, ఆయన నిర్వాసితుల తరపునే పోరాడుతున్నప్పటికీ కాంగ్రెస్ తరపున ప్రభుత్వంతో పోరాడుతున్నారని తెరాస నేతలు ఆరోపించగలుగుతున్నారు. అధికార, ప్రతిపక్షాల మద్య జరుగుతున్న ఈ రాజకీయ చదరంగంలో సామాన్యరైతులు, రైతు కూలీలు అన్యాయంగా నలిగిపోతున్నారు. కనుక ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో కొంత మానవత దృక్పధం చూపితే బాగుంటుంది.