తెలంగాణా ప్రభుత్వం ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒంటరి మహిళలకు నెలకు రూ.1,000 పెన్షన్ అందించే కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలో 1,08,302 మంది ఒంటరి మహిళలు ఈ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వారందరికీ రాష్ట్ర మంత్రులు, ఆయా నియోజకవర్గాలలోని ప్రజాప్రతినిధులు నిన్న ధృవపత్రాలు అందజేశారు. ఈ పధకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు కనుక అర్హులైన మహిళలందరికీ జూలై 1వ తేదీన ఏప్రిల్, మే రెండు నెలల పెన్షన్ కలిపి ఒకేసారి అందజేయబడుతుంది.
ఇక నుంచి ప్రతీనెలా వారి బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలలో ఈ పెన్షన్ జామా చేయబడుతుంది. కనుక దీని కోసం వారు ఎవరినీ ప్రాధేయపడనవసరం లేదు. ఎవరికీ లంచాలు చెల్లించనవసరం కూడా ఉండదు.
ఈ పధకాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఒంటరి మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి మొదట గడువు విదించినప్పటికీ, ఈ పధకానికి దరఖాస్తు చేసుకొంటున్న మహిళల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీనికి గడువును ఎత్తివేసి ఇక నుంచి నిరంతరంగా నమోదు ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించింది. ఒంటరి మహిళలను ఆదుకోవాలనే ఆలోచనే గొప్ప మానవతాదృక్పధంతో తీసుకొన్నది. ఇప్పుడు దీనికి ఎటువంటి గడువు పెట్టకుండా నిరంతరంగా దరఖాస్తులు స్వీకరించాలనే నిర్ణయం వలన ఇంకా అనేకమంది నిసహ్హయులైన మహిళలకు సహాయం అందుతుంది. తెరాస ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం చాలా అభినందనీయం.