తెలంగాణాలో నిరంకుశపాలన: కోదండరామ్

టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఈరోజు తమ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి  తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అనంతరం టిజెఎసి నేతలతో కలిసి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్దకు వెళ్ళి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం తెలంగాణాలో నిరంకుశ పాలనా సాగుతోంది. ప్రశ్నించే గొంతులను బలవంతంగా అణచివేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. అమరవీరుల త్యాగాల వలననే నేడు తెలంగాణా ఏర్పడి తెరాస అధికారంలోకి రాగలిగింది. కానీ ఇప్పుడు వారి కుటుంబాలను కూడా పట్టించుకోవడం లేదు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మలిదశ ఉద్యమాలలో చాలామంది బలిదానాలు చేసుకొన్నారు. తెరాస సర్కార్ వారిని కూడా గుర్తించి వారి పేరిట కూడా స్థూపాలు ఏర్పాటు చేసి, వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలి. అలాగే మానుకోట ఘటనలో గాయపడి అంగవైకల్యం పొందిన ఉద్యమకారులను ప్రభుత్వమే ఆదుకోవాలి,” అని కోరారు.