నేటితో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మూడేళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్ తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నగరంలో చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోట, మక్కా మసీదు, రవీంద్ర భారతి, క్లాక్ టవర్, గన్ పార్క్, శిల్పారామం వంటి అన్ని దర్శనీయ ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అలాగే మెదక్ చర్చి, కరీంనగర్లోని ఎలగందుల కోట, నల్లగొండలోని ఛాయా సోమేశ్వరాలయం, యాదాద్రి, భువనగిరి కోట, వరంగల్ ఖిల్లా మొదలైన ప్రాంతాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం 9.55 గంటలకు గన్ పార్క్ చేరుకొని అక్కడ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణా కోసం బలిదానాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ చేరుకొంటారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తరువాత ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఈ మూడేళ్ళలో తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి తీసుకొన్న చర్యల గురించి,ఇక ముందు చేపట్టబోయే కార్యక్రమాలా గురించి వివరిస్తారు. అనంతరం 11.40కు ప్రగతి భవన్ చేరుకొంటారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో మూడు రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిశ్చయించింది. జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ జిల్లా కేంద్రాలలోగల ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాలను ఎగురవేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జరుపుతారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో తెలంగాణా రాష్ట్రానికి పేరు తెచ్చిన 411 మందిని ప్రభుత్వం సన్మానిస్తుంది.
ముంబై, సూరత్, పూణే, కర్నాటక, కోల్ కతా తదితర ఇతర రాష్ట్రాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, కువైట్ తదితర దేశాలలో స్థిరపడిన ప్రవాస తెలంగాణావాసులు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణా ప్రజలందరికీ మై.తెలంగాణా.కామ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.