ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా?

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరికొద్ది సేపటిలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభకు హాజరుకాబోతున్నారు. ఇదివరకు 1979లో కాంగ్రెస్ పరిస్థితి బాగోనప్పుడు స్వర్గీయ ఇందిరాగాంధి ఇక్కడే బహిరంగ సభను నిర్వహించిన తరువాత మళ్ళీ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలిగారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఇది సెంటిమెంటుగా మారింది.ఈరోజు రాహుల్ గాంధీ కూడా సంగారెడ్డి సభలో పాల్గొంటే ఆయనకు, పార్టీకి అందరికీ మంచి జరుగుతుందని వారు భావిస్తున్నారు.

అయితే రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో వాస్తవిక రాజకీయ పరిస్థితులను గమనించినట్లయితే, ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేనట్లే కనిపిస్తున్నాయి. తెలంగాణాలో కేసీఆర్ నేతృత్వంలో తెరాస నానాటికీ చాలా బలపడుతుంటే, జాతీయస్థాయిలో మోడీ నాయకత్వాన్న ఎన్డీయే కూటమి బలపడుతోంది. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాల వలన అది కొంచెం బలం సంపాదించుకొని తెరాసను డ్డీ కోగలగినట్లు కనిపిస్తోంది కానీ ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడం రాహుల్ గాంధీ కానిపని అని తేలిపోయింది. కనుక తెలంగాణా కాంగ్రెస్ వలన రాహుల్ గాంధీకి ఏమైనా ప్రయోజనం కలుగవచ్చేమో కానీ ఆయన వలన రాష్ట్ర కాంగ్రెస్ కు కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.