మియాపూర్ ఎఫెక్ట్: 72మందిపై బదిలీ వేటు

మియాపూర్ భూకుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సి.ఐ.డి.దర్యాప్తుకు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలనే ఆయన ఆదేశాల మేరకు ఈ రెండుమూడు రోజులలో ఏడు జిల్లాలో మొత్తం 72మంది సబ్ రిజిస్ట్రార్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. పట్టణ ప్రాంతాలలో చిరకాలంగా తిష్ట వేసుకొని కూర్చొని అవినీతికి పాల్పడుతున్న మారుమూల ప్రాంతాలకు బదిలీ చేసి, అక్కడ నిజాయితీగా పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ లను వారి స్థానంలో పట్టణప్రాంతాలకు బదిలీ చేసింది. 

హైదరాబాద్ తో సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, అదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసిబి అధికారులు దాడులు చేసి, అనేక చోట్ల అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అవినీతి జరుగుతున్నట్లు గుర్తించిన చోట సదరు అధికారుల ఇళ్ళపై కూడా దాడులు నిర్వహిస్తూ విలువైన పత్రాలు, నగదును స్వాధీనం చేసుకొంటున్నారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డి ఇంటిపై దాడి చేసి కిలో బంగారు ఆభరణాలు, రూ.2లక్షల నగదు, చాలా విలువైణ పత్రాలు స్వాధీనం చేసుకొన్నారు. అయనపై ఎల్.బి. నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు కావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఇక నుంచి నిరంతరంగా ఇటువంటి తనికీలు నిర్వహిస్తుంటామని ఏసిబి అధికారులు తెలిపారు.