త్వరలో హోంగార్డులకు ఒక తీపి కబురు వినిపిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అది బారీగా జీతాలు పెంచడమే అని తెలుస్తోంది. పోలీస్ కానిస్టేబుళ్ళతో సమానంగా కష్టపడి పనిచేస్తున్న హోంగార్డులకు వారికి సమానంగా జీతాలు చెల్లించడం న్యాయమని అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాష్ట్ర డిజిపిని కోరారు. ఆయన సూచనల మేరకు హోంగార్డులకు రూ.7,884 పెంచి నెలకు రూ. 19,884కు జీతం చెల్లించాలని కోరుతూ పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది జనవరిలోనే ప్రతిపాదనలు పంపించింది. ఈ ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు లేదా రేపు సంతకం చేసి రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పోలీస్ శాఖలో అన్ని విభాగాలలో కలిపి మొత్తం 19,201 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. వారికి ప్రస్తుతం నెలకు రూ.12,000 జీతం ప్రభుత్వం చెల్లిస్తోంది. అది ఒకేసారి దాదాపు రూ.20,000 కు పెంచితే హోంగార్డుల ఆనందానికి అంతు ఉండదు. ఈ కారణంగా ఇకపై హోంగార్డు ఉద్యోగాలకు కూడా పోటీ పెరిగే అవకాశం ఉంటుంది.