తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక బహిరంగ లేఖ వ్రాశారు. దానిలో తెలంగాణా సాధన కోసం జరిగిన ఉద్యామాలలో పాల్గొన్నవారిపై మూడేళ్ళు అవుతున్నా ఇంకా కేసులు ఎందుకు ఎత్తివేయలేదు? అని ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా అందరిపై కేసులు ఎత్తివేయాలని కోరారు. తెలంగాణా కోసం శ్రీకాంతాచారి బలిదానం చేసుకొన్న డిశంబర్ 3వ తేదీని అమరవీరుల దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా కోసం మొత్తం 1569 మంది బలిదానాలు చేసుకొంటే వారిలో సగం మంది కుటుంబాలకైనా ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయకపోవడాన్ని రేవంత్ రెడ్డి తన లేఖలో తప్పు పట్టారు. ప్రభుత్వం తక్షణమే అందరికీ రూ.10 లక్షల నగదు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఒక్కో కుటుంబంలో ఒక్కకరికి ప్రభుత్వోద్యోగం, వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాలలో కూడా అమరవీరుల జ్ఞాపకార్ధం స్తూపాలు నిర్మించాలని కోరారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా ద్రోహులని ఎవరినైతే దూషిస్తున్నారో వారందరూ ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఉన్నవారిలో చాలా మంది తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడినవారే లేదా అసలు తెలంగాణా ఉద్యమాలకు దూరంగా ఉన్నవారే. అటువంటివారిని అందరినీ తన పక్కన పెట్టుకొని ఇతరులను దూషించడం సిగ్గుచేటు,” అని అన్నారు.