దేశంలో ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఒంటెల అక్రమరవాణా, వధను నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు ఏమి ఆహారం తినాలో..ఎటువంటి బట్టలు ధరించాలో కేంద్రప్రభుత్వం నిర్ణయించడం సరికాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కేంద్రం నిర్ణయంపై అప్పుడే నిరసనలు మొదలయ్యాయి కూడా. ప్రతిపక్షాలలో కొన్ని పార్టీలు కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సిద్దం అవుతున్నాయి. దీనిపై దాఖలైన ఒక ప్రజాహిత పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై నెలరోజులు స్టే విధించింది. దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్తించే ఇటువంటి నిర్ణయాలను కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోవడం సరికాదని, దానిపై పార్లమెంటులో చర్చించి దాని ఆమోదం తీసుకోవలసి ఉంటుందన్న పిటిషనర్ల వాదనలతో మద్రాస్ హైకోర్టు ఏకీభవించి స్టే విదించింది.