కేసీఆర్ కు అది అలవాటే: రేవంత్ రెడ్డి

విశాఖపట్నంలో నిన్నటితో ముగిసిన తెదేపా మహానాడు మూడు రోజుల సభలో తెలంగాణా తెదేపాకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. వారిలో తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన మహానాడులో ప్రసంగిస్తూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

ఈ మూడేళ్ళలో కేసీఆర్ ఏమీ చేయకపోయినా ఎప్పటికప్పుడు కొత్త హామీలు గుప్పిస్తూ ప్రజలను వంచిస్తున్నారని, తన మాటకారితనంతో రోజులు దొర్లించేస్తున్నారని ఎద్దేవా చేశారు. నవాబులాగ పదెకరాలలో ‘గడి’ కట్టుకొని దానిలో తన వందిమాగధులతో భజనలు చేయించుకొంటూ తన పాలనకు తనే కితాబులు ఇచ్చుకొంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఈ మూడేళ్ళ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 3,300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారంటే ఆయన పాలన ఎంత గొప్పగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.

దళితులు, బలహీనవర్గాల యువత ఉన్నతవిద్యలు అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంటే వారికి కేసీఆర్ గొర్రెలు, మేకలు ఇచ్చి కాసుకొని బ్రతకమని చెపుతున్నారన్నారు. వారు ఎప్పటికీ అదేవిధంగా జీవించాలని కేసీఆర్ అనుకొంటున్నారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

పాములవాడు బుట్టలో నుంచి పామును బయటకు తీసి ఆడించి డబ్బులు దండుకొన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనపుడల్లా తెలంగాణా సెంటిమెంటును బయటకు తీసి ప్రయోగించడం అలవాటే అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు దాని కోసం ప్రధాని నరేంద్ర మోడీతో యుద్ధం చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెపుతూ ముస్లిం ప్రజలను మోసగించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.