కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా రావు: కేసీఆర్

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పీసిసి ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీందర్ర్ రావు వారి అనుచరులతో కలిసి ఇవ్వాళ్ళ తెలంగాణా భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మొన్న నేను ప్రకటించిన సర్వే ఫలితాలను చూసి ప్రతిపక్షాల గుండెల్లో గుబులు మొదలైనట్లుంది. అందుకే నోటికి వచ్చినట్లు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అడ్రస్ లేని పార్టీ తెదేపా..క్యాడర్ లేని పార్టీ భాజపా..కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసి చాలా కాలమే అయ్యింది. ఇక కాంగ్రెస్ నేతలు పోటీ చేస్తే ఎవరికీ డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు. అటువంటి పార్టీలు మా సర్వేపై నోటికి వచ్చినట్లు వాగుతున్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మన ఆదాయం పెరుగుతుందని చెప్పాను అదే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో మేమే గెలుస్తామని సర్వే చేసి చెప్పాను. నేను చెప్పినదానికంటే ఇంకా ఎక్కువ సీట్లే గెలుచుకొన్నాము. అలాగే నేను చెప్పిన అనేక విషయాలు నిజమని నిరూపితం అయ్యాయి. అయినా ప్రతిపక్ష నేతలకు భ్రమలు తొలగడం లేదు. మా సర్వే తప్పని వాదిస్తున్న కాంగ్రెస్ నేతలు దమ్ముంటే రాజీనామాలు చేసి ఎన్నికలలో పోటీ చేసి గెలిచి చూపాలి,” అని కేసీఆర్ సవాలు విసిరారు. 

తెరాస పాలన గురించి మాట్లాడుతూ, “మేము కాంగ్రెస్ ప్రభుత్వంలాగ సగం సగం పనులు చేయడం లేదు. ఏది చేసినా మనసుపెట్టి రాష్ట్రానికి, ప్రజలకు ప్రయోజనం కలిగేలా చేస్తున్నాము. మేము చేపడుతున్న పనులను కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్ళి అడ్డుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రాజెక్టులను ఆపడం వారి తరం కాదు. పైగా వారు చేస్తున్న ఇటువంటి పనులను చూసి ప్రజలు కూడా వారిని అసహ్యించుకొంటున్నారు. ఇప్పుడే చెపుతున్నాను..వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు ఎవరికీ డిపాజిట్లు కూడా దక్కవు. మాకు అధికారం మీద యావ లేదు. మేము చేస్తున్న పనులు ప్రజలకు నచ్చి గెలిపిస్తే అధికారంలో ఉంటాము లేకుంటే ఇంటికి పోతాము,” అని కేసీఆర్ అన్నారు.