అవి బోగస్ సర్వేలు: ఉత్తం కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సర్వే ఫలితాలపై ఊహించినట్లుగానే ప్రతిపక్ష నేతలు చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోతామనే భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలకు ధైర్యం చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రతీ రెండు నెలలకొకసారి ఈ బోగస్ సర్వే ఫలితాలు ప్రకటిస్తుంటారు. అసలు ఈ మూడేళ్ళలో ప్రజలకు ఏమి మేలు చేసారని మీకు వాళ్ళు అన్ని సీట్లు కట్టబెడతారని అనుకొంటున్నారు? మీ పాలనపై ప్రజలు చాలా అసహనంతో ఉన్నారని గుర్తించి, వారిని మభ్యపెట్టేందుకే ఇలాగ చీటికి మాటికి సర్వే ఫలితాలు ప్రకటిస్తున్నారని మేము భావిస్తున్నాము. ఇది కేసీఆర్ లో నెలకొనున్న అభద్రతాభావానికి నిదర్శనం తప్ప ప్రజాధారణకు కాదు.

అసలు ఆయన ఈ సర్వేలను ఏ సంస్థల చేత చేయించారో తెలియదు కానీ మొత్తం 119 సీట్లలో 111 తమకే వస్తాయని చెప్పుకొన్నారు. ఎలాగూ అవి ఆయన స్వంత సర్వేలే కనుక మొత్తం 119 సీట్లలో తామే గెలుస్తామని చెప్పుకొంటే సరిపోయేది కదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా 111 సీట్లు గెలుస్తామని చెపుతున్నారు కానీ తెరాసాకు 11 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆయనకు తన సర్వేలపై అంత నమ్మకమే ఉంటే తక్షణమే తెరాసలో చేర్చుకొన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలను ఎదుర్కొంటే ఎవరి బలం ఎంతో తేలిపోతుంది కదా? వాటిలో ఓడిపోతే ఆయన సర్వే నిజమని తేలుతుంది. మేము కూడా వాటిని అంగీకరిస్తాము. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే తక్షణమే ఫిరాయింపు ఎమ్మెల్యేల  చేత రాజీనామాలు చేయించి ఎన్నికలను ఎదుర్కోవాలి,” అని సవాల్ విసిరారు.