మరో యుద్ధానికి శంఖం పూరించిన కేసీఆర్

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై తీవ్ర విమర్శలు గుప్పించి భాజపాతో యుద్ధం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మరో కొత్త యుద్ధానికి శంఖం పూరించారు. తెలంగాణా భవన్ లో ఈరోజు జరిగిన తెరాస నేతలు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన తాజాగా మరో సర్వే నివేదికను బయటపెట్టారు. దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్లయితే తెరాస 106-111 సీట్లు తప్పకుండా గెలుచుకొంటుందని చెప్పారు. రాష్ట్రంలో భాజపాకు ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ పార్టీకి మధిర, కల్వకుర్తిలో మాత్రం రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకొనే అవకాశం ఉందని చెప్పారు. ఆ రెండు స్థానాలపై కూడా గట్టిగా దృష్టి కేంద్రీకరిస్తే వాటిని తెరాస గెలుచుకోవడం కష్టం కాదని చెప్పారు. ఇక హైదరాబాద్ లో మజ్లీస్ పార్టీ 6 స్థానాలు గెలుచుకొంటుందని చెప్పారు. తెలంగాణాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఈ సర్వే ఫలితాలలో నిజానిజాలను పక్కనపెడితే, ఆయన చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్, భాజపా, తెదేపాలకు తీవ్ర ఆగ్రహం కలిగించడం ఖాయం. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ మాటలు జీర్ణించుకోవడం కష్టమే కనుక కాంగ్రెస్ నేతలు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం తధ్యం. వారితో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా కేసీఆర్, తెరాసలపై విరుచుకు పడటం ఖాయం. వారికి తెరాస నేతలు కూడా అంతే ధీటుగా సమాధానాలు చెప్పడం కూడా ఖాయమే. కనుక మళ్ళీ కొన్ని రోజుల వరకు అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్ధం అనివార్యం. ఇది అన్ని పార్టీల నేతలు తమ ఉనికిని చాటుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది కనుక అందరూ దానిలో పాల్గొనడానికి ముందుకు రావడం కూడా ఖాయమేనని చెప్పవచ్చు.